రాష్ట్రపతి ప్రమాణోత్సవానికి.. కెసిఆర్

SMTV Desk 2017-07-25 12:27:31  telangana cm kcr, delhi, president

హైదరాబాద్, జూలై 25 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెండు రోజుల పర్యటన కోసం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు జరిగే 14 వ రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం పాల్గొంటారు. తర్వాత ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి తదితరులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర విభజన సమస్యలతోపాటు రాష్ట్రానికి చెందిన కీలకమైన అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉన్నది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద రాష్ట్రంలో 11 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఈ పథకంలో శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా కింద ఖర్చు చేయాల్సిన రూ.4,950 కోట్ల నిధులను నాబార్డు ద్వారా త్వరగా ఇప్పించాలని జలవనరులశాఖ మంత్రిని సీఎం కోరే అవకాశం ఉన్నది. తెలంగాణ ఆదాయం ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి 3.5 శాతం మేరకు వివిధ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకునే అవకాశం రాష్ట్రానికి ఉన్నదని, దీనికి సంబంధించిన లాంఛనాలను త్వరగా పూర్తిచేయాలని అరుణ్‌జైట్లీని కోరనున్నట్టు తెలిసింది. అలాగే రాష్ట్ర సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్‌ను ఇవ్వడానికి రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినందున దానికి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేయాలని రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కోరనున్నారు. వెనుకబడిన జిల్లాలకు పాత జిల్లాల ప్రకారం ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున 9 జిల్లాలకు రూ.450 కోట్లు మూడో విడత నిధులు రావాల్సి ఉన్నా ఇంతవరకు విడుదల కాలేదు. వీటిని త్వరగా విడుదల చేయాలని కోరనున్నట్టు సమాచారం. జీఎస్టీలో చిన్న గ్రానైట్ పరిశ్రమలపై 28 శాతం పన్ను విధించడం ద్వారా ఈ పరిశ్రమ దెబ్బతిని ఐదు లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని, దీనిని దృష్టిలో పెట్టుకొని 5 శాతం పన్నుకు పరిమితం చేయాలని కోరనున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రారంభించడానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అపాయింట్‌మెంట్ లభిస్తే విభజన సమస్యలు తదితర సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నది. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు బాల్క సుమన్, మల్లారెడ్డి ఢిల్లీకి వెళ్లారు.