దమ్మున్న నాయకుడు కేసీఆర్‌

SMTV Desk 2018-11-27 12:26:18  Telangana, KCR, KTR,

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వొక్క వ్యక్తిని ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయయని ప్రజాకూటమిపై విమర్శలు గుప్పించారు. సోమాజిగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. తెలంగాణలో నాలుగు పార్టీలు వొక వ్యక్తిని ఓడించేందుకు కలిసాయంటే.. ఎవరు బలవంతులో అర్థం చేసుకోవాలని కేటీఆర్‌ కోరారు. ప్రజాకూటమి పొరపాటున గెలిస్తే నెలన్నరకో సీఎం మారతాడని ఎద్దేవా చేశారు.

గతంలో ఉన్న ప్రభుత్వాలు డబ్బా ఇళ్లు కట్టిస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించిందని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని.. అయితే సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని పెద్దలు అన్నమాటను గుర్తుచేశారు. పేదవారికి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. ప్రజాకూటమిలో సీఎంను నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి నిర్ణయించాలని.. అదీ సీల్డ్‌ కవర్‌లోనని విమర్శించారు. తెలంగాణకు సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా?.. లేదా తెలంగాణ మట్టిలో పుట్టిన సింహంలాంటి కేసీఆర్‌ సీఎం కావాలా? ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్‌ కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పాల్గొన్నారు.