నేడు రాష్ట్రపతిగా...కోవింద్

SMTV Desk 2017-07-25 10:28:05  india president, ramnath kovind parlament

న్యూఢిల్లీ, జూలై 25 : భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. కేంద్రంలోని అధికార ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి అయిన కోవింద్‌.. విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌పై 65.5 శాతం ఓట్ల తేడాతో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్న రెండో దళిత నాయకుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం సోమవారంతో ముగిసింది. రాజ్యాంగంలోని 56వ అధికరణం ప్రకారం.. రాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు. అయితే దీనితో సంబంధం లేకుండా తన వారసుడు వచ్చేవరకూ ఆయన పదవిలోనే ఉంటారు. కోవింద్‌ ప్రమాణస్వీకారం కోసం ఈ నెల 22న పూర్తిస్థాయి రిహార్సల్స్‌ జరిగాయి. ప్రమాణస్వీకార విధానం మొదట రామనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని ముందు భాగానికి చేరుకొని అటు నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కోవింద్ కలిసి ఒకే కారులో పార్లమెంట్ భవనం వద్దకు బయల్దేరుతారు. అక్కడ వీరిద్దరికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ లు ఘన స్వాగతం పలికి పార్లమెంట్ సెంట్రల్ హాలులోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత జాతీయ గీతాలాపన ఉంటుంది. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. అయితే.. ముందుగా హోంశాఖ కార్యదర్శి వచ్చి.. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన లాంఛనాలు చదివి వినిపిస్తారు. తదనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ రామ్‌నాథ్ కోవింద్‌తో రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. ప్రమాణస్వీకారం అనంతరం 21 గన్‌లను పేల్చడం ద్వారా సైన్యం గౌరవ వందనం సమర్పిస్తుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ప్రణబ్ తన ఆసనంలో కూర్చోబెడుతారు. ఇక నూతన రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన తర్వాత రామ్‌నాథ్, ప్రణబ్ కలిసి ఒకే కారులో రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అయితే తిరుగు ప్రయాణంలో కారులో వీరిద్దరి సీట్లు మారుతాయి. రాష్ట్రపతి భవన్‌లో నూతన రాష్ట్రపతికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పిస్తాయి. భవనం గురించి కొత్త రాష్ట్రపతికి ప్రణబ్‌కు వివరిస్తారు. ఆ తర్వాత కోవింద్ ప్రణబ్‌ను ఆయన నివాసం 10 రాజాజీ మార్గ్ వద్ద దిగబెడుతారు. రాష్ట్రపతి అధికారిక లిమోసీన్ వాహనంలో ప్రణబ్ ముఖర్జీకి ఇదే చివరి ప్రయాణం. రాజాజీ మార్గ్ నుంచి రామ్‌నాథ్ కోవింద్ ఒక్కరే రాష్ట్రపతి భవన్‌కు తిరిగి పయనమవుతారు.