మన గ్రామాలు దేశానికే ఆదర్శం : బాబు

SMTV Desk 2017-07-24 17:55:07  amaraavathi, chendrabaabu naidu, tele conference,

అమరావతి, జూలై 24 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ గ్రామాభివృద్ధి, కుటుంబాల ఆనందం, ఆరోగ్య జీవనం ప్రభుత్వ లక్ష్యాలు కావాలని పిలుపునిచ్చారు. సీజన్‌ మిస్‌ అయితే సంవత్సరం కోల్పోయినట్లేనన్న ఆయన.. అటు కాలాన్ని.. ఇటు నిధులను సద్వినియోగం చేసుకుని అనుకున్న ఫలితాలను సాధించాలన్నారు. కాగా అనంతపురం జిల్లాలో వర్షపాతం లోటు అధికంగా ఉందని దానికి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆగస్టు 15లోగా వేరుశనగ నాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రాపింగ్‌ 72శాతం పూర్తైందని దానిని 100శాతం పూర్తిచేయాలని స్పష్టం చేశారు. పంట రుణాల పంపిణీ లక్ష్యం చేరుకొని, కౌలు రైతులకు రుణ పంపిణీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఇన్‌పుట్‌ సబ్సిడీ 76శాతం రైతుల ఖాతాల్లో పడిందని.. మిగిలింది కూడా త్వరగా జమచేసి పెట్టుబడులకు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కూరగాయల సేద్యం, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.