సనత్ నగర్ ని ఒదిలే ప్రసక్తే లేదు : మర్రి శశిధర్ రెడ్డి

SMTV Desk 2018-11-19 16:44:02  Congress party, Marri shashidhar reddy, Sanath nagar party ticket

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ విడుదల చేసిన మూడు జాబితాల్లో తన పేరు లేకపోవడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తుది జాబితాలోనైనా తన పేరు వస్తుందని భావించిన ఆపార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తన పేరు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. సనత్ నగర్ సీటును టీడీపీకి కేటాయించింది. అక్కడ నుంచి కూన వెంకటేశంగౌడ్ పోటీ చేస్తున్నారు. కాగా, సనత్‌నగర్ సీటు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు మర్రి శశిధర్ రెడ్డి. ఆ సీటును అధిష్ఠానం తనకే కేటాయిస్తుందని భావించినా చివరికి ఆయనకు నిరాశే మిగిలింది. అధిష్ఠానం తనకు సీటు కేటాయించకపోయినా, స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించారు. తనకు అధిష్ఠానంపై విశ్వాసం ఉందని, రెబల్‌గా పోటీచేయనని శనివారం ప్రకటించిన మర్రి.. మనసు మార్చుకున్నారు. పార్టీని వీడనని, రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని అన్నారు.

తనకు సీటు రాకపోవడానికి కారణం పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డేనని ఆరోపించారు. తనను తప్పించేందుకు కుట్రలు చేశారని విరుచుకుపడ్డారు. పార్టీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మర్రి శశిధర్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ పెద్దలను కలిశారు. వారు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మర్రి వెనక్కి తగ్గకుండా తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు. అధిష్ఠానం సనత్‌నగర్ సీటును తనకే కేటాయిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేసిన మర్రి.. అలా జరగని పక్షంలో స్వతంత్రుడిగా బరిలో నిలిచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.