జగన్ కోడి కత్తి దాడి పై స్పందించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి

SMTV Desk 2018-11-19 16:35:59  YSRCP, Jagan mohan reddy, Vishakha airport attempt to murder incident, Devaneni uma maheshwara rao

విజయవాడ, నవంబర్ 19: వైఎస్ జగన్ కోడి కత్తి దాడి పై స్పందించిన తీరుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేఖించారు. విజయవాడలో మంత్రి ఉమ ఆదివారం ఉద‌యం మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగిన 23 రోజుల తర్వాత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తనపై కుట్ర పన్నారంటూ ముఖ్యమంత్రిని, డీజీపీని జగన్‌ ముద్దాయిలుగా పేర్కొనడం సరికాదన్నారు. జగన్ కేసు విషయంలో పోలీసు విచారణ సక్రమంగానే జరుగుతోందన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్‌ పోలీసులకు సహకరించలేదని..ఇప్పుడు 23 రోజుల తర్వాత థర్డ్‌ పార్టీ విచారణ జరపాలనడం దారుణమని మండిపడ్డారు.

జగన్ నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు పలు సార్లు ప్రయత్నించినా ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రక్తపు మరకలు పడిన చొక్కాను పోలీసులకిచ్చి సహకరించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం జగన్ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రా పోలీసులపై జగన్‌కు నమ్మకం లేదని.. బాధ్యతలను విస్మరించి ఆయన మాట్లాడటం మంచిపద్ధతి కాదని విమర్శించారు.