కోడికత్తి దాడిపై తొలిసారి స్పందించిన జగన్

SMTV Desk 2018-11-18 15:19:58  Jaganmohan reddy, Vishakha airport incident on jagan, Attempt to murder

విజయనగరం, నవంబర్ 18: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై విశాఖలో జరిగిన కోడికత్తి దాడిపై తొలిసారి స్పందించారు. జిల్లాలోని పార్వతీపురంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు.

హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ మీడియా ముందుకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. హత్యాయత్నం చేసింది తన అభిమానంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ చంద్రబాబుకు సన్నిహితుల్లో వొకరని చెప్పారు. దాడి జరిగిన గంటకే స్క్రిప్ట్ ప్లే చేశారని, చంద్రబాబు స్క్రిప్ట్‌ను డీజీపీ చదివారని జగన్ వ్యాఖ్యానించారు.

ఫ్లెక్సీలో విజయమ్మ ఫొటో లేదని, గరుడపక్షి ఫొటో ఉందన్నారు. దాడి జరిగిన సమయంలో నిందితుడి దగ్గర ఎలాంటి లెటర్ కనపడలేదని జగన్ చెప్పారు. లెటర్ ఇస్త్రీ చేసినట్లు ఉందని, మడతలు కూడా లేవన్నారు. మెరుగైన పాలన కోరుకునే అభిమాని తనపై ఎందుకు హత్యాయత్నం చేస్తాడని జగన్ ప్రశ్నించారు. తాను విశాఖలో అడుగు పెట్టినప్పుడే సీసీ కెమెరాలు ఆగిపోయానని తెలిపారు. తెలిసీ తెలీకుండా అభాండాలు వేయకూడదనే హత్యాయత్నంపై తాను వెంటనే స్పందించలేదనన్నారు. అప్పటికప్పుడు చొక్కా మార్చుకుని బయల్దేరానని చెప్పారు. ఎవ్వరూ కంగారుపడొద్దని ట్వీట్ చేశానని జగన్ స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో తనపై హత్యాయత్నం, కుట్ర చేయకపోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు వొప్పుకోరని జగన్ ప్రశ్నించారు. కుట్రలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని జగన్ విమర్శించారు.

సీబీఐ విచారణ జరిగితే నేరుగా జైలుకి వెళ్తారని చంద్రబాబు వణికిపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌పై కేసులు క‌ట్టిన‌ప్పుడు చంద్ర‌బాబుకు ముద్దు అయిన సిబిఐ… ఇప్పుడు ఎందుకు వ‌ద్దంటున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఓటుకు నోటు కేసు నుండి త‌ప్పించుకోవ‌డానికే చంద్ర‌బాబు మోడీపై యుద్ధం ప్ర‌క‌టించార‌న్నారు. చంద్ర‌బాబులాంటి మోస‌గాడు, న‌క్క‌జిత్తుల మారి నాయ‌కుడు ప్ర‌పంచంలో ఎవ‌రూ ఉండ‌ర‌న్నారు