తమిళనాడును వణికిస్తున్న 'గజ'

SMTV Desk 2018-11-17 18:07:58  Tamilnadu, Sea side states, Chennai, GAJA Cyclone

తమిళనాడు, నవంబర్ 17: సముద్ర తీర ప్రాంతాలు ముఖ్యంగా తమిళనాడు, చెన్నై ప్రజలను గజ తుపాను వణికిస్తుంది. తాజాగా నైరుతీ బంగాళఖాతంలో దూసుకొచ్చిన గజ తుఫాన్ తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది. శుక్రవారం ఉదయం కడలూరు-పంబన్ మధ్య తీరం దాటింది. దీంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, తీర ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిశాయి. తుఫాన్ ప్రభావంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు, నాగపట్నం, పుదుకొట్టై, తిరువారూర్, తంజావూరు, రామనాథపురం జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస శిబిరాలకు తరలించారు.
ప్రభుత్వాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తీరప్రాంత జిల్లాలు నిర్మానుష్యంగా మారాయి. చెన్నై నుంచి మైలాడుదురై మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. తుఫాన్ ప్రభావం రాష్ట్రంలోనూ అక్కడక్కడా కనిపిస్తోంది. రాయలసీమ సహా తీరప్రాంత జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు విరామం ప్రకటించారు. కడప, వొంగోలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

తుఫాన్ ధాటికి వణికిపోతున్న తమిళనాడుకు అన్ని విధాల సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన మేరకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.