కత్తి కాంతారావు బయోపిక్ ప్రారంభం

SMTV Desk 2018-11-16 13:45:17  Kathhi kantharav, Biopic, Telugu senior actor

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మాత్రం తెలుగు సినిమాకు కత్తి కాంతారావు తిలకంలాంటివారని చెప్పింది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. కాంతారావు చాలా సినిమాల్లో నటించారు. కానీ ఆయనకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. కారణాలు చాలా వున్నాయి. ఆయన తెలంగాణ ప్రాంతంలో పుట్టడం కూడా ఇందుకు ప్రధాన కారణం అని చెబుతారు తెలంగాణ వాదులు. నల్గొండ జిల్లా కోదాడలో జన్మించిన కాంతారావు కత్తి వీరుడిగా తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆయన ఉన్నత మనస్తత్వం కలవాడని, దానాలు చేయడంలో అస్సలు వెనకాడరని మంచి పేరుంది. అలా దానాలు చేసీ చేసీ ఆయన ఆస్తులు కరిగిపోయాయని అంటారు. ఎన్నో జానపద సినిమాలకు ప్రాణం పోశారు హీరో కాంతారావు. అంత చేసిన ఆయనకు నివాళిగా ఇప్పటి సినిమావాళ్ళు ఏం చేస్తున్నారు ? ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల వారసుల్లా కాంతారావు వారసులు గట్టిగా లేరు. దీంతో ఆయన ఉనికిని తెలుగు సినిమా రంగం మరిచిపోయే ప్రమాదం కూడా వుంది. దీన్ని గురుతర బాధ్యతగా తెలంగాణ ప్రాంత దర్శక నిర్మాతలే తీసుకోవాలి. ఈ క్రమంలో తెలుగు సినీ రంగానికి ఎంతో చేసిన ఆయనకు నివాళిగా ఓ బయోపిక్ చెయ్యాలని భావించారు ఓ దర్శకుడు. ఓవైపు ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో కాంతారావు బయోపిక్ కూడా రావాల్సిన అవసరం ఎంతో వుందని భావించారు దర్శకులు పీసీ ఆదిత్య.

ఈ రోజు కాంతారావు పుట్టిన రోజు సంధర్బంగా బయోపిక్‌ను మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఆయన జీవితం మీద సమగ్రంగా విశేషాలను సేకరించి ఈ కథ తయారు చేసినట్టు దర్శకులు వెల్లడించారు. కాంతారావు జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఘట్టాలు ఉన్నాయనీ, వాటిని ఈ సినిమాలో ఆవిష్కరించడం జరుగుతుందని ఆదిత్య అన్నారు. డిసెంబర్ 10 తరువాత రెగ్యులర్ షూటింగును జరపనున్నామని వెల్లడించారు.