ఎయిర్ ఇండియా ఆస్తులకి వేలం

SMTV Desk 2018-11-16 13:04:25  Airindia, Company loss, Assets salings

ముంబై, నవంబర్ 16: భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు ఆర్ధిక సమస్యలు తప్పేలా లేవు. అత్యధిక రుణభారంతో సతమతమవుతున్న ఎయిరిండియా సంస్థ తన స్థిరాస్తులను అమ్మకానికి పెట్టి కొంత మొత్తం సేకరించే పనిలో పడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా 16 నగరాల్లో ఉన్న ఆస్తులకు కంపెనీ వేలం నిర్వహించనుంది. 2012 లో యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన విక్రయ ప్రణాళిక ప్రకారం ఈ అమ్మకాలను జరుపుతోంది. 2014-2021 మధ్య కాలంలో 5 వేల కోట్లు సమకూర్చడం ఎయిరిండియా లక్ష్యం. ఎయిరిండియా మొత్తం 55 వేల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా ముంబై, కోల‌్‌కతా, చెన్నయ్, పూణే, బెంగళూరు, అమృత్‌సర్ మొదలగు 14 నగరాల్లో ఆస్తులను విక్రయించారు. అప్పుడు అమ్ముడుపోని ఆస్తులను ఇప్పుడు విక్రయిస్తున్నట్టు సదరు అధికారి తెలిపారు. వివిధ నగరాల్లో ఉన్న 72 స్థిరాస్తులను అమ్మి దాదాపు 700 కోట్ల నుంచి 800 కోట్లు సమకూర్చాలని భావిస్తోంది.