శబరిమల ఆలయ తీర్పు అమలు పై సతమతవుతున్న కేరళ సర్కార్

SMTV Desk 2018-11-15 17:49:11  Shabarimala temple, Supreem court, Kerala governament

కేరళ, నవంబర్ 15: శబరిమల ఆలయ వివాదంపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు అమలు చేయడానికి కేరళ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు.. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలను కొండ ఎక్కకుండా పురుష భక్తులు అడ్డుకుంటుండడంతో వారి కళ్లుగప్పి మహిళలకు అయ్యప్ప స్వామి దర్శనం చేయించాలని యోచిస్తోంది. దీనికోసం హెలికాప్టర్లను వాడాలని పోలీసులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.

అయితే ఈ చిట్కాకూడా పనిచేయదని, సన్నిధానం వద్ద మహిళలను పురుష భక్తులు అడ్డుకునే అవకాశముందని సర్కారు భావిస్తోంది. దీంతో మరింత శాంతియుత మార్గాలను అన్వేషిస్తోంది. అయ్యప్పను పురుష భక్తులు దర్శించే సీజన్లలో కాకుండా అన్ సీజన్లల్లో కొన్ని రోజుల పాటు మహిళా భక్తులను గుడిలోకి అనుమతించేందుకు యత్నిస్తున్నామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం చెప్పారు. ‘దీనిపై నేను ప్రధాన అర్చకుడితో, పందలం రాజవంశం వారితో మాట్లాడతాను.. మేం సుప్రీం కోర్టు తీర్పును తప్పకుండా అమలు చేసి తీరతాం.. అందరికీ భద్రత కల్పిస్తాం అని వెల్లడించారు. మరోపక్క.. శబరిమలకు మహిళల అనుమతి వివాద పరిష్కారం కోసం సీఎం నేతృత్వంలో గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశం రసాభాసగా ముగిసింది. బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులు వాకౌట్ చేశారు.