రికార్డు స్థాయిలో నామినేషన్ల నమోదు

SMTV Desk 2018-11-15 15:07:16  Telangana elections, Nominations, Chief commisiioner, Rajath kumar

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మూడోరోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. బుధవారం వొక్కరోజే 331 నామినేషన్ పత్రాలు దాఖలైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 113 నియోజకవర్గాల్లో 331 నామినేషన్లు దాఖలైనట్టు అధికారికంగా ధ్రువీకరించింది.
తొలిరోజు కార్తీక సోమవారం అవడంతో దివ్య ముహూర్తంగా భావించిన నాయకులు ఆ దిశగా నామినేషన్లు దాఖలు చేశారు. 12వ తేదీ 38 నియోజకవర్గాల్లో 48 నామినేషన్లు దాఖలయ్యాయి. 13వ తేదీ మంగళవారం 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 39 మంది నామినేషన్లు వేశారు. 14వ తేదీ బుధవారం మాత్రం నామినేషన్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. 113 నియోజకవర్గాల్లో 331 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రావణ నక్షత్రం మంచిరోజు అవడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఈ మూడు రోజుల్లో కలిపి ఇప్పటి వరకు 418 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మంత్రి హరీష్ రావు గజ్వేల్‌లో నామినేషన్లు వేశారు. వరుసగా ఆ పార్టీ నేతలు 78 మంది అభ్యర్థులు బుధవారం రోజే నామినేషన్లు దాఖలు చేశారు. 331లో ఇతరులు దాఖలు చేసిన నామినేషన్లే 117 ఉన్నాయి. ఇదిలా వుండగా ఖమ్మం, నిజామాబాద్ రూరల్, పాలకుర్తి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా వంటి ఆరు నియోజకవర్గాల్లో మూడు రోజుల్లో వొక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన వివిధ పార్టీలు…

టీఆర్ఎస్ – 78
కాంగ్రెస్ – 63
బీజేపీ – 47
టీడీపీ – 09
బీఎస్పీ – 07
సీపీఎం – 05
సీపీఐ – 01
ఎంఐఎం -01
ఎన్సీపీ – 02
ఇతరులు – 117