బెయిల్ లభించడం అంత సులువు కాదు!!!

SMTV Desk 2017-07-23 14:55:04  drugs in tollywood, heros, sit

హైదరాబాద్, జూలై 23: డ్రగ్స్ కేసుతో సినీ పరిశ్రమలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. తొలి వారం నలుగురిని సిట్ విచారిస్తే, ఈ వారం వరుసగా ప్రముఖులు అబ్కారీ ఆఫీసుకు క్యూ కట్టబోతున్నారు. అయితే ఒక్కొక్కరిని ఒక్కో రోజు విచారిస్తున్నప్పటికీ అందరికి ఒకే ప్రశ్నావళి ఉండకపోవచ్చని సమాచారం. వారి ముందు రకరకాల ఆధారాలు ఉంచుతున్నట్లు పలు వార్తలు బయటకి వస్తున్నాయి. సోమవారం నుండి శనివారం వరకు వరుసగా సిట్ ప్రశ్నలు ఎదుర్కొనబోతున్న నటులు : జూలై 24 - నవదీప్ జూలై 25 - రవితేజ జూలై 26 - చార్మి జూలై 27 - ముమైత్ ఖాన్ జూలై 28 - తనీష్ జూలై 29 - నందు కెల్విన్ తో పరిచయాలు, డ్రగ్స్ ముఠాతో సంబంధాలు వంటి అంశాలకు సంబంధించి కీలక ఆధారాల్ని సిట్ సేకరించింది. అయితే కెల్విన్ చెప్పిన ఆధారాలను, సాక్ష్యాలను సినీ ప్రముఖుల ముందు పెడుతున్నారు. కాదని చెబితే క్రాస్-ఎగ్సామిన్, అవునని చెబితే మరిన్ని ఆధారాలు, మరికొందరి పేర్లు అడుగుతున్నారు. కాగా రేపు నవదీప్ సిట్ ముందు హాజరు కానున్నాడు. ఈ నేపధ్యంలో నవదీప్ మాట్లాడుతూ డ్రగ్స్ గురించి తనకు ఏం తెలియదన్నాడు. మరి ఈ యువ హీరోని అధికారులు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు అనేది చర్చనీయాంశమైంది. హీరో రవితేజ విషయానికొస్తే, పూరికి అత్యంత సన్నిహితుడైన రవితేజ వ్యవహారం ఈ తరుణంలో కీలకంగా మారబోతుంది. కాని హీరో రవితేజ, నందులకు సౌతఫ్రికా నుండి డ్రగ్స్ సరఫరా చేసినట్టు జీషాన్ అలీ అనే వ్యక్తి సంచలన నిజాన్ని బయటపెట్టడంతో సిట్ ప్రశ్నావళి మరింత పెద్దగా మారింది. రవితేజ ద్వారా పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేసినట్టు కూడా తెలిపాడు అలీ. దీన్ని బట్టి రవితేజ విచారణ అనంతరం మరికొంత మందికి నోటీసులు జారి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీని పై హైకోర్ట్ సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కేసులో బెయిల్ లభించడం అంత సులువు కాదని పేర్కొన్నారు.