హరీష్ రావు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేసిఆర్

SMTV Desk 2018-11-12 15:31:09  K Chandra Shekar rao, Harish rao, CM, Minister

గజ్వేల్, నవంబర్ 12: తెలంగాణ ప్రభుత్వం రానున్న ఎన్నికల సందర్భంగా తమ సొంత నియోజకవర్గం గజ్వేల్‌పై దృష్టి పెట్టారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ క్రమంలో స్థానిక కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో కాసేపటి వరకు నవ్వులు పూశాయి.

గజ్వేల్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి హరీశ్ షాకవుతున్నారని కేసీఆర్ అన్నారు. కొద్దిసేపటి వరకు ఆయన సీరియస్‌గానే అలా మాట్లాడారని అనుకున్నారు. కానీ తర్వాత ఆయన హరీశ్ రావును ఆట పట్టిస్తున్నారని అనుకున్నారు. గజ్వేల్ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని, అది చూసి సిద్ధిపేటకు ఎక్కడ పోటీ వస్తుందోనని హరీశ్ భయపడుతున్నాడని అన్నారు కేసీఆర్.

‘గతంలో సిద్ధిపేట ప్రజలతో ఎమ్మెల్యేగా సంబంధాలు కలిగి ఉండేవాడిని. గజ్వేల్‌కు వచ్చిన తర్వాత నా పాత్ర పూర్తిగా మారింది. ముఖ్యమంత్రిగా నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నాను. 60 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది గజ్వేల్‌. ఈ 4 ఏళ్లలో అభివ‌ృద్ధి కొంతే జరిగింది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. గజ్వేల్‌కు రైలు పరుగులు పెడుతూ రావాలి, నియోజకవర్గంలో ఇకముందు ఇల్లులేని వారంటూ ఉండరు. కొండ పోచమ్మ సాగర్‌ను రాబోయే వర్షాకాలంలో నింపుతాం. గజ్వేల్‌లో ప్రతి ఇంటికీ రెండు ఉచిత పాడి గేదెలు ఇస్తాం. 75 శాతం పథకాలకు రూపకల్పన ఎర్రవల్లిలో జరిగింది. కంటివెలుగు పథకం ఆలోచనకు నాంది పడింది కూడా ఎర్రవల్లిలోనే అని వ్యాఖ్యానించారు కేసీఆర్. టీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని అన్నారు.