రోబో న్యూస్ రీడర్

SMTV Desk 2018-11-09 18:47:26  China, Robo News Reader, News Channel

చైనా, నవంబర్ 09: చైనా దేశం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులను తయారుచేస్తూ సాంకేతిక రంగంలో ముందంజలో వుంది. అయితే ఈ మధ్య చైనా మరొక సాహసం చేసింది. న్యూస్ రీడింగ్ కోసం వొక కృత్రిమ మేధస్సు కలిగిన రోబోను తయారుచేసి అందరిని ఆశ్చర్యపరచింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కలిగిన న్యూస్ రీడర్ కావడం విశేషం.

ఈ న్యూస్ రీడర్ ఏ మాత్రం అలసిపోకుండా బ్రేక్ తీసుకోకుండా 24 గంటలు 365 రోజులు ప్రపంచంలో జరుగుతోన్న వార్తలను ప్రజలకు అందించగలడని జిన్హువా న్యూస్ ఛానల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఐదో ఇంటర్నెట్‌ సదస్సులో ఈ కృత్రిమ మేధస్సు న్యూస్‌ రీడర్‌ను జిన్హువా ఛానల్‌ ఆవిష్కరించింది.



ఈ న్యూస్‌ రీడర్‌‌ని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ, చైనా సెర్చ్‌ ఇంజిన్‌ సొగోవ్‌.కామ్‌ సంయుక్తంగా రూపొందించాయి. మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ముఖ కవళికలు ఎలా మార్చాలి తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ న్యూస్ రీడర్ తమ రిపోర్టింగ్ టీంలో వొకరిగా మారిపోయాడని, 24 గంటలు పనిచేస్తాడని న్యూస్ ఛానల్ వర్గాలు న్యూస్ ఛానల్ అధికారులు తెలిపారు. తమ అధికారిక వెబ్‌సైట్, సామజిక మాధ్యమాల్లో అతని సేవలు ఉపయోగించుకుంటామని ఛానల్ వర్గాలు తెలిపాయి. ఖర్చులు తగ్గించుకోవడం, సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి కృత్రిమ మేధస్సుని ఉపయోగించుకుంటున్నామని ఛానల్ పేర్కొంది.