నగరంలో విచ్చలవిడిగా హవాల రవాణా

SMTV Desk 2018-11-08 11:30:31  Telangana Elections, Illegal Money Transporting, Political Leaders

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణాలో రాబోతున్న ఎన్నికల క్రమంలో అక్రమ డబ్బు పంపిణి విపరీతంగా పెరిగిపోతుంది. బుధవారం మధ్యాహ్నం పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో ఓ కారులో తరలిస్తున్న రూ.5 కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు చేపట్టగా, మూడు చోట్ల మొత్తం రూ.7,71,25,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులోభాగంగానే పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో కారులో తరలిస్తున్న రూ.5కోట్ల నగదుని సైఫాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాహనంలోని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌, షాఇనాయత్‌గంజ్‌ ప్రాంతాల్లో రూ.2.70 కోట్ల నగదును పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. వీటికి కూడా సరైన పత్రాలు లేకపోవడంతో హవాలా సొమ్ముగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఓ ప్రముఖ రాజకీయ నేత ఇంటికి సమీపంలోనే ఈ నగదు లభించడంతో ఆ కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పెద్దమొత్తంలో నగదు తరలించే వ్యక్తులు సరైన ఆధారాలు చూపించకపోతే దాన్ని సీజ్ చేస్తామని ఈసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. నెలరోజులుగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.9 కోట్ల నగదును సీజ్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల వారం ముందు ఇంకెలా ఉంటుందో అంటూ సర్వత్రా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.