జియో అభివృద్ధిపై ముకేశ్ అంబానీ

SMTV Desk 2017-07-21 15:45:11   Reliance Jio, voice calls, Offer, Mukesh Amban

ముంబై, జూలై 21 : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నలభై ఏళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎంతో ఎదిగిందని ఆ సంస్థ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ అన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఈ 40 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. జియో ఉన్నంత కాలం వాయిస్ కాల్స్‌కు పైసా కూడా వసూలు చేయబోనని వాటాదారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రధాని మోదీ కలులు కంటున్న డిజిటల్ ఇండియాను సాకారం చేయడంలో తమవంతు పాత్ర పోషిస్తానన్నారు. జియో సేవలు అందుబాటులోకి వచ్చాక ఇప్పటి వరకు రోజుకు 250 కోట్ల నిమిషాలను ఉచితంగా అందించినట్టు చెప్పిన ముకేశ్ నెలకు 125 కోట్ల గిగాబైట్ల డేటాను అందిస్తున్నట్టు వివరించారు. జియో రాకతో భారత్‌ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను మించిపోయింది. మార్కెట్లోకి జియో రాక ముందు బ్రాండ్‌ బ్యాండ్ సేవల విషయంలో 156వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం అగ్రస్థానానికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. డేటాకు డబ్బులు వసూలు చేస్తే జియో పతనం ఖాయమన్న ఊహాగానాలు ప్రస్తుతం నీటి బుడగల్లా తేలిపోయాయన్నారు. మార్చిలో టారిఫ్ ఆఫర్లు ప్రకటించిన తర్వాత అత్యధిక మంది యూజర్లు పోస్ట్‌ పెయిడ్ వినియోగదారులుగా మారారని తెలిపారు. రూ.309 ప్లాన్‌ను ఎక్కువ మంది వినియోగదారులు ఎంచుకుంటున్నారని, ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా చెల్లింపు వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్టు ముకేశ్ అంబానీ వివరించారు. 1977లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో మూడున్నర వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. 1997లో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి పెడితే ప్రస్తుతం అది రూ.16.5లక్షల కోట్లకు చేరింది. కేపిటలైజేషన్‌ రూ.10కోట్ల నుంచి రూ.5లక్షల కోట్లకు చేరింది. 40 ఏళ్ల ప్రగతిని ధీరూభాయ్‌ అంబానీకి అంకితం చేస్తున్నా.’ అని ముఖేష్‌ పేర్కొన్నారు.