దేశ వ్యవహారాల్లో మూడో ప్రమేయం వద్దు: రాహుల్ గాంధీ

SMTV Desk 2017-07-21 14:33:06  Rahul Gandhi, Kashmir, Pakistan, China

న్యూఢిల్లీ, జూలై 21 : కాశ్మీర్ అంటే భారత్ , భారత్ అంటే కాశ్మీర్ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి చైనా సహకారం ఏమీ అవసరం లేదన్నారు. మా దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల మధ్యవర్తిత్వం అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వ విధానాల వల్ల జమ్మూకశ్మీర్‌ మరింత అట్టుడికిపోతుందని విమర్శించారు. గతేడాది జూలైలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదిని బుర్హాన్‌ వనీని భద్రతా బలగాలు హతమార్చినప్పటి నుంచి కాశ్మీర్‌లో ఆందోళనలు చల్లారకుండా ఉన్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నలుగుతున్న కాశ్మీర్‌ అంశం పరిష్కరించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గతంలో అన్నారు. ఆ వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా తిప్పికొట్టింది. పొరుగు దేశాలతో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలమని.. అందులో ఎవరి ప్రమేయం అవసరం లేదని భారత్‌ వ్యాఖ్యానించింది. ఇప్పటికే భారత్‌-చైనా మధ్య డొక్లామ్‌ సరిహద్దు విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.