తెరాస మీడియా పై ఫిర్యాదు చేసిన ప్రముఖ నేత

SMTV Desk 2018-11-01 11:25:05  Revanth reddy, Congress, TRS, Media

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణలో రాబోతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టీఆరెస్ అనుకూల మీడియా సంస్థలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రసార సాధనాలుగా పనిచేయవలసిన ఆ సంస్థలు తెరాస అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని కనుక వాటిని ఇక ప్రసారసాధనాలుగా పరిగణించరాదని, మీడియా ముసుగులో వాటిని నిర్వహించేవారిని సమాజంలో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న సంఘవిద్రోహ శక్తులుగా పరిగణించాలని రేవంత్‌రెడ్డి కోరారు. తెరాస బెదిరింపులకు భయపడి మరికొన్ని ఇతర మీడియా సంస్థలు కూడా ఆ పార్టీకి అనుకూల వార్తలు ప్రసారం చేస్తున్నాయని, తెరాస సంబందిత వార్తలకే అవి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కనుక అటువంటి మీడియా సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్ని రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.

రేవంత్‌రెడ్డి తెలంగాణ పోలీసులు, కొందరు ప్రభుత్వాధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్, ప్రభుత్వ శాఖలలో కొందరు ఉన్నతాధికారులు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, మహాకూటమి నేతల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు ఇచ్చినా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించకపోవడాన్ని రేవంత్‌రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొందరు అధికారులు యాధేచ్చగా వాటిని ఉల్లంఘిస్తున్నారని అయినా వారిపై చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం వెనకాడుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.