కోదండకు బుజ్జగింపు..

SMTV Desk 2018-11-01 11:14:54  Mahakootami, Prof Kodandaram, TRS, Congress, Rahul gandhi, Uttam kumar reddy

హైదరాబాద్, నవంబర్ 1: రానున్న ఎన్నికల సందర్భంగా తెరాస కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. అభ్యర్థుల జాబితాకు ఆమోద ముద్ర కోసం టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ బుదవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 4 స్థానాలు కేటాయించినట్టుగా సమాచారం. నవంబర్ 2న జాబితాను ప్రకటిస్తారని సమాచారం.


ఇదిలా వుండగా సీట్ల పంపకంలో జాప్యంపై టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా లెక్కలు తేల్చకపోవడం సరికాదన్నారు. ఆలస్యం వల్ల పార్టీల శ్రేణుల్లో, ప్రజల్లోనూ గందరగోళం నెలకొందని మండిపడ్డారు. తమకు 8 సీట్లు మాత్రమే ఇస్తామన్నారని, దీనిపై ఢిల్లీలోని హస్తం అధిష్టానంతోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. ‘పొత్తుగా ఇంకా పెట్టుకోలేదు. పొత్తుపై ఆసక్తి ప్రకటన మాత్రమే చేశాం. ఆసక్తి ఉంది, ఏర్పాటు చేసుకుందామనే ప్రకటన మాత్రమే అది..’ అని అన్నారు. పంచాయతీ తేలకపోతే వొంటరిగానే పోటీ చేస్తామని, అంతేగాని బీజేపీవైపు మొగ్గుచూపే ప్రసక్తే లేదని తేల్చేశారు. పంచాయితీ కోసం రాహుల్ గాంధీ.. కోదండరాంను పిలిపించినట్టు తెలుస్తోంది.