రైతుబంధు నగదు పాతబాకీలుగా వసూలు

SMTV Desk 2018-10-30 17:20:15  Telangana elections, SBI, Election code, Raithu bandhu

మహబూబ్‌నగర్‌, అక్టోబర్ 30: తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంటపెట్టుబడి కోసం ఎకరాన రూ.4,000 చొప్పున చెల్లించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈసారి ఆ నగదును చెక్కుల రూపంలో ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో, ప్రభుత్వం ఆ సొమ్మును నేరుగా రైతుల ఖాతాలలో జమా చేసింది. ప్రభుత్వం అందించిన ఆ సొమ్మును తీసుకొందామని వెళ్ళిన రైతులకు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్ పేట మండల కేంద్రంలో గల ఎస్.బి.ఐ. షాక్ ఇచ్చింది. ఆ సొమ్మును వారి పాత అప్పు క్రింద జమా చేసుకొన్నామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో రైతులకు ఏమి చేయాలో పాలుపోక నిరాశగా వెనుతిరుగుతున్నారు. మండలంలోని లోకిరేవ్‌, అశ్రీపూర్‌ గ్రామాల రైతులకు ఈయవలసిన రైతుబంధు నగదును పాతబాకీలుగా వసూలు చేసుకొన్నట్లు సమాచారం.

పంటలు వేసుకొనే సమయంలో రైతుల చేతిలో సరిపడినంత డబ్బు ఉండకపోవడంతో వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కబంద హస్తాలలో చిక్కుకొంటున్నారని గుర్తించిన ప్రభుత్వం, ఈ రైతుబంధు పధకం ప్రవేశపెట్టింది. ఈ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున మొదటివిడత సొమ్ముకు ఎటువంటి కొర్రీలు వేయకుండా బ్యాంకులు రైతులకు అణాపైసలతో సహా చెల్లించేశాయి. కానీ ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం నడిపిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ ఎన్నికల హడావుడిలో ఉన్నందున ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశ్యంతో ఎస్.బి.ఐ. ఈవిధంగా చేసినట్లుంది. ఈ పధకం ద్వారా రైతులకు మేలు చేసి వారిని ప్రసన్నం చేసుకోవాలని తెరాస సర్కార్ భావిస్తుంటే, బ్యాంకులు ఈవిధంగా చేసి రైతులకు ఆగ్రహం కల్పిస్తే దాని వలన తెరాస నష్టపోయే ప్రమాదం ఉంటుంది.