విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు

SMTV Desk 2018-10-30 15:35:12  Chattisghar, Journalist, Maoist firings, Police

ఛత్తీస్‌గఢ్‌, అక్టోబర్ 30: పోలీసుల వెంట ఎన్నికల కవరేజీ కోసం అడవుల్లోకి వెళ్లిన ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. మావోయిస్టుల దాడిలో అతనితోపాటు ఇద్దరు పోలీసులు కూడా మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఎన్నికల కవరేజీ కోసం ఆరాన్‌పూర్ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు, జర్నలిస్టుల బృందంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.



మృతి చెందిన జర్నలిస్టు అచ్యుతానంద సాహు.. దూరదర్శన్‌లో కెమెరామేన్‌గా పనిచేస్తున్నారు. చనిపోయిన పోలీసులను మంగళ్ రామ్, రుద్రప్రతాప్ సింగ్‌గా గుర్తించారు. మావోయిస్టుల కాల్పుల్లో పలువురు గ్రామీణులకు గాయాలైనట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలను బహిష్కరించాలని నక్సల్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.