ఆశ్రమాల్లో అత్యాచారాలు

SMTV Desk 2018-10-29 16:27:11  omojaya baba ashramam, drugs and rapes, spiritual guru, young women victims

మేడ్చల్, అక్టోబర్ 29: కీసర మండలం గోదుమకుంటలోని ఓమోజయ బాబా ఆశ్రమం వద్ద హిందూ వాహిని కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. కాప్రా వంపుగూడలోని మరో ఓమోజయ బాబా ఆశ్రమం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు ఆశ్రమాల్లో మానసిక స్థితి సరిగ్గా లేని యువతకులకు మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు బాధిత కుటుంబాలు చెప్తున్నారు. ఈ బాబాకు హైదరాబాద్‌ చుట్టుపక్కల నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. ఆయన ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పలువురు యువతులు ఆకర్షితులవుతున్నారు.

ఈ మధ్య నిర్మల్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆశ్రమంలో వదిలి వెళ్లారు. ఆదివారం కూతుర్ని చూసేందుకు వచ్చిన తల్లిని సిబ్బంది లోపలికి పంపలేదు. దీంతో ఆమె అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కీసర ఆశ్రమంలో సోదాలు జరిపి ఏడుగురు యువతులకు విముక్తి కల్పించారు. ఆశ్రమంలో బాబా తప్ప మరే పురుషులూ లేరని, ఆధ్యాత్మికత పేరుతో ఆశ్రమంలో సంఘ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయని మాజీ శిష్యులు చెబుతున్నారు. కాగా, తమ గురువు చాలా మంచివాడని, నిబంధనల ప్రకారమే యువతులను ఆశ్రమంలో చేర్చుకుంటున్నామని శిష్యులు అంటున్నారు.