7 కేజీల బంగారం పట్టివేత

SMTV Desk 2018-10-29 12:39:46  Gold, Chennai,

చెన్నై, అక్టోబర్ 29: భారతీయులకు బంగారం అంటే ఎంతో మోజో చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాపారులకు, స్మగ్లర్లకైతే చెప్పలేనంత మోజు. దేశంలో అంత బంగారం ఉందని, ఇంత బంగారం ఉందని వేసే అంచనాలు కేవలం కాకిలెక్కలు. సముద్రంలో కాకిరెట్టలు. ఎంత బంగారం వుందో తెలిసే చాన్సే లేదు. మన దేశంలో సక్రమ బంగారంతోపాటు అక్రమ బంగారం కూడా దీటుగా చలామణి అవుతోంది కనుక. ఈ నేపథ్యం లో చెన్నై విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2.27 కోట్ల విలువైన 6.995 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ సరిహద్దులోని బాగ్డోగ్రా నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నట్టు విచారణలో నిందితులు తెలిపారు. చెన్నైకి చెందిన వ్యాపారి తమను అక్కడి నుంచి బంగారాన్ని తీసుకురావాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు.

ఎలక్ట్రానిక్ వస్తువుల రూపంలో ఉన్న వీటిని మలేషియా నుంచి నేపాల్‌కు, అక్కడి నుంచి చెన్నైకి రవాణా చేస్తున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. పండుగ సీజన్ నేపథ్యంలో విమానాశ్రయంలో నిఘా పెట్టిన అధికారులకు వేర్వేరు విమానాల్లో వచ్చిన ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరిద్దరినీ జుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు.