బైక్ సర్వీస్ సెంటర్లో చోరీ

SMTV Desk 2018-10-29 12:24:38  bikes thefts, hyderabad, vinayaka mobraks pvt.ltd

హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్‌కు చెందిన మధుసూదన్ అనే వ్యక్తి రూ.2.19 లక్షల విలువైన బైక్‌ను వినాయక మోబైక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొన్నాడు. 9 ఫిబ్రవరి 2016లో సర్వీసింగ్ కోసం బైక్‌ను సర్వీస్ సెంటర్‌లో ఇచ్చాడు. నాలుగు రోజుల తర్వాత బైక్‌ను ఎవరో దొంగలించారని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చెప్పారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సర్వీస్ సెంటర్‌లోనే తన బైక్ దొంగతనానికి గురైంది, కాబట్టి తనకు కొత్త బైక్, లేదంటే బైక్ ధరను సర్వీస్ సెంటర్ చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే బైక్ దొరికిన తర్వాత నష్టపరిహారం చెల్లిస్తామని సర్వీస్ సెంటర్ నిర్వహకులు తెలిపారు. అలాగే బైక్‌ను బాగు చేసి ఇస్తామని పేర్కొన్నారు.బీమా వచ్చాక పరిహారం సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారు. 20 మే 2016న బైక్ దొరకడంతో పోలీసులు దానిని వినాయక మొబైక్స్‌కు అందించారు. బైక్‌ను బాగు చేసి మధుసూదన్‌ను పిలిచి టెస్ట్ డ్రైవ్ చేయమన్నారు. బైక్ పూర్తిగా పాడైందని తనకు ఆ బైక్ వద్దని, నష్టపరిహారం కావాలని కోరాడు. అందుకు డీలర్ నిరాకరించడంతో మధు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. కేసును విచారించిన ఫోరం, వినియోగదారుడికి బైక్ మొత్తం రూ. 2.19లక్షలతో పాటు అదనంగా రూ. 75వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.