ఖమ్మం జిల్లాలో భారి పేలుడు

SMTV Desk 2018-10-29 11:03:42  bomb blast, khammam , police

ఖమ్మం, అక్టోబర్ 29: కొందమూరు మండలం జంగాలలో ఈ రోజు తెలవారుజామున భారి పేలుడు సంభవించింది. దాని ప్రభావం వల్ల రెండంతస్తుల భవనం వొక్కసారిగా కుప్పకూలింది. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

అలాగే ఈ దాటికి సమీప ఇళ్లు, షాపులు కూడా ధ్వంసమయ్యాయి. భారీ పేలుడు సంభవించడంతో అక్కడి స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదానికి గురైన దుకాణం షెటర్స్ ఎగిరిపడ్డాయి.
పేలుడు కారణంగా మొత్తం 60 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. కోటి వరకు ఆస్తి నష్టం జరిగింది.

తెల్లవారుజామున తామంత నిద్రలో ఉన్న సమయంలో వొక్కసారిగా మంటలు రావడంతో బయటకు పరుగులు తీశామని బాధితులు పేర్కొంటున్నారు. ఇళ్లలో ఉన్న డబ్బు, బంగారంతో పాటు విలువైన వస్తువులు కాలిపోయాయని కన్నీరు పెట్టుకుంటున్నారు.

‘గతంలో కూడా ఇలా ప్రమాదం జరిగి చాలా ఇళ్లు దగ్ధం అయ్యాయి. అధికారులు వచ్చి రాసుకుని వెళ్లిపోయారు అంతే.. ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఆదుకోలేదు. ఎన్నికల సమయంలో వోట్లు అడగడానికి మాత్రం నాయకులు వస్తారు. ఇప్పుడు మళ్లీ మా ఇళ్లన్నీ కాలిపోయాయి. కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండటానికి వొక్క ఇళ్లు లేకుండా అన్నీ బూడిదయ్యాయి. ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.