రూ.5లక్షల్లోపు లావాదేవీలు జరిగిన ఖాతాలపై ఐటీ విచారణ

SMTV Desk 2018-10-26 13:23:27  INCOME TAX, ELECTION CODE, BANK ACCOUNTS,

హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణలో రాబోయే ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ నేతలు వోటర్లను ధనం, మద్యంతో ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు నిఘా పెంచారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఉన్న ఆయా బ్యాంకుల ఖాతాలపై నిఘా ఏర్పాటు చేశారు. రూ.లక్ష దాటిన లావాదేవీలపై కన్నువేస్తున్నారు. లావాదే వీల విలువ రూ.5లక్షలు దాటితే లెక్క చెప్పాల్సిందేనంటున్నారు. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలను సేకరించడంతోపాటు అనుమానాస్పద ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున అధికారులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల్లో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా నగదు తరలిస్తున్న వారిపై కేసులు నమోదుచేసి నగదుతోపాటు వాహనాలనూ సీజ్‌ చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు డిజిటల్‌ పద్ధతులను ఎంచుకుంటున్నారు.

బ్యాంకు ఖాతాల ద్వారా నగదును పంపిస్తే ఈజీగా నగదును అందించవచ్చని భావిస్తున్నారు. దీంతో అధికారులు ఖాతాలపై నిఘా వేశారు. రూ.లక్ష పైన లావాదేవీలు జరిగితే ప్రతీ ఖాతాలపై నిఘా వేస్తున్నారు. రూ.5లక్షల్లోపు లావాదేవీలు జరిగిన ఖాతాలపై ఇన్‌కం ట్యాక్స్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల ద్వారా విచారణ జరిపించనున్నారు. అకౌంట్‌ వివరాలు అనమానాస్పదంగా ఉంటే వెంటనే ఖాతాను సీజ్‌చేసేలా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు అధికంగా ఉండడమే గాకుండా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారు. మహిళా సంఘాలను మచ్చికచేసుకుంటే వారి ఓటు బ్యాంకును సొమ్ము చేసుకోవాలని కొందరు అభ్యర్థులు భావించే అవకాశాలున్నాయి. వీరందరికీ బ్యాంకుల్లో గ్రూపు ఖాతాలున్నాయి. దీంతో వారికి నేరుగా కాకుండా బ్యాంకు ఖాతాల్లో నగదును జమచేస్తే గ్రూపు సభ్యులందరి సహకారం ఉంటుందని భావిస్తుంటారు.

వీరితోపాటు ఉపాధిహామీ, ఆసరా లబ్ధిదారులు పెద్దఎత్తునే ఉండడంతో ఆయా లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.