హలో గురు ప్రేమకోసమే రివ్యూ

SMTV Desk 2018-10-24 17:48:39  Hello Guru prema Kosame , Hello Guru Prema Kosame review, ram pothineni

కథ :

కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న సంజయ్ అలియాస్ సంజు (రామ్) ఊళ్లో జాలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. సడెన్ గా ఓ రోజు తన మేనమామ వచ్చి హైదరాబాద్ లో జాబ్ చేయమని అడుగగా తల్లిదండ్రులు కూడా అదే ఆలోచిస్తున్నారని తెలిసి హైదరాబాద్ బయలుదేరుతాడు. కాకినాడ నుండి హైదరాబాద్ ట్రైన్ లో అనుపమ (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. అయితే ట్రైన్ జర్నీలో రామ్ ప్రవర్తన చూసి అను భయపడుతుంది. తల్లి కోరిక మేరకు ఆమె స్నేహితుడు విశ్వనాథం ఇంట్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు రామ్. తీరా చూస్తే విశ్వనాథం ఎవరో కాదు హీరోయిన్ తండ్రే. అలా సంజయ్, అనుల కలయిక జరుగుతుంది. అయితే సంజు ఆఫీస్ లో ప్రణీతని చూసి ఇష్టపడతాడు. ఆమె ప్రపోజ్ చేసే టైంకు తాను అనుని ప్రేమిస్తున్నానని గుర్తిస్తాడు. ఫ్రెండ్ కొడుకుగా ఇంట్లోకి వచ్చిన సంజయ్ తన ప్రేమని అనుకి చెప్పాడా..? విశ్వనాథం సంజులు ఎలా స్నేహితులయ్యారు..? ఫైనల్ గా సంజు, అనుల ప్రేమకథ ఎలా ముగిసింది అన్నది ఈ సినిమా కథ.

విశ్లేషణ :

సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలను డైరెక్ట్ చేసిన నక్కిన త్రినాథ రావు అదే ఫార్మెట్ లో కూతురిని ప్రేమించి తండ్రికి నరకం చూపించే కథతోనే హలో గురు ప్రేమకోసమే సినిమా చేశాడు. స్నేహితురాలి కొడుకని ఇంట్లోకి చేరడం. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయినే ప్రేమించడం ఇది చూస్తే కాస్త నువ్వు నాకు నచ్చావ్ సినిమా పోలిక కనిపిస్తుంది. అయితే దర్శకుడు ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో సీరియస్ గా ఉండాల్సిన కొన్ని సీన్స్ కూడా కామెడీ చేశాడు.

రామ్, అనుపమల పెయిర్ బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే స్క్రీన్ ప్లే రాసుకున్న దర్శకుడు సెకండ్ హాఫ్ తేలగొట్టేశాడు. అంతా ఊహించిన విధంగానే కథనం సాగుతుంది. ఇక సీన్స్ కూడా అంత ఎమోషనల్ గా అనిపించవు. హీరోయిన్ హీరో మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచే టైంలో ఆకట్టుకోలేదు. అది సినిమాకు హైలెట్ కావాల్సిన సీన్ లో ఒకటి అది కూడా ఏదో అలా కానిచ్చారు.

ఫైనల్ గా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ హలో గురు ప్రేమ కోసమే యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. కొత్త కథ.. డిఫరెంట్ టేకింగ్ లాంటి కోరికలు ఉన్న వారికి ఈ సినిమా నచ్చదు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలిసిన కథనే తెలిసిన కథనం ప్రకారం కాస్త కామెడీతో నడిపించారు.

నటన, సాంకేతికవర్గం :

హీరో రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. అయితే సినిమాలో రామ్ ఎందుకో చాలా స్లిమ్ లుక్ లో కనిపిస్తాడు. ఇక అనుపమ ఈ సినిమాలో మరింత అందంగా కనిపించింది. ప్రణీత ఉన్న కాసేపు ఓకే అనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ సినిమా మొత్తం బాగా చేశాడు. రామ్, ప్రకాశ్ రాజ్ సీన్స్ అలరించాయి. సితార, ఆమని, జయప్రకాశ్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం జస్ట్ ఓకే. బిజిఎం పర్వాలేదు. దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మ్యూజిక్ మిస్ అయ్యిందనే చెప్పాలి. కథ, కథనాల్లో దర్శకుడు రొటీన్ గా సాగించినా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అదే సినిమాను కాపాడింది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ఒక్కమాటలో :

హలో గురు ప్రేమ కోసమే.. రొటీన్ ప్రేమ కథ..!