భారీ బడ్జెట్ తో మోడల్ ప్లాస్టిక్ పార్క్

SMTV Desk 2017-07-20 15:18:12  L PLASTIC PARK ,TSIIC ,CMKCR ,

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమ కేంద్రంగా ఉన్నందున, దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో మోడల్‌ ప్లాస్టిక్‌ పార్కు (క్లస్టర్‌) ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఈ మేరకు టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ..రూ.100 కోట్లతో మోడల్ ప్లాస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి లేదా సిద్దిపేట జిల్లాలో ఈ పార్క్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఈ పార్క్ ఏర్పాటు, డీఎస్‌ఆర్‌పై కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజెన్సీ గ్రాంట్ టోర్నాటన్ డైరెక్టర్ వీ పద్మానంద్ బుధవారం బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్లాస్టిక్‌ పార్క్ ఏర్పాటుకయ్యే ఖర్చు, మౌలిక వసతు లు, ప్రభుత్వాల ఆర్థిక సహాయం తదితర అంశాలను వివరించారు. ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సానుకూలంగా ఉన్నారని బాలమల్లు చెప్పారు. ఈ నెలాఖరులోగా భూములను ఎంపిక చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తామని ప్లాస్టిక్‌ పరిశ్రమల యజమానులకు వివరించారు. పరిశ్రమకు అవసరమైన భూమిని యజమానులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ పార్కు ఏర్పాటుకు అయ్యే రూ.100 కోట్ల వ్యయంలో కేంద్రం 50 శాతం, రాష్ట్రం 25 శాతం, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ కోటాలో యజమానులు 25 శాతం వాటా భరించాల్సి ఉంటుందన్నారు. ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్‌ గల ప్లాస్టిక్‌ పార్కు ఏర్పాటుతో 200 మంది ప్రమోటర్స్ కు, 5 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సమావేశంలో నిమ్జ్ సీఈఓ మధుసూదన్, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకుడు దేవానంద్, టీఎస్‌ఐఐసీ జీఎం శ్యాంసుందర్, పీవీ రావు, తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భూపేందర్‌గుప్తా, కార్యదర్శి నల్లు అశోక్‌రెడ్డి, కోశాధికారి తాటి శ్రీనివాస్, సీఐపీఈటీ డైరెక్టర్ కిరణ్, గ్రాంట్ టోర్నాటన్ ఏజెన్సీ మేనేజర్ తుషార్ శర్మ, సభ్యుడు సుజీత్, ఎస్బీఐ, విజయా బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.