కేసీఆర్ పై ధ్వజమెత్తిన జైపాల్ రెడ్డి

SMTV Desk 2018-10-16 10:49:25   Congress leader S Jaipal Reddy , K.C.R ,TELANGANA

హైదరాబాద్‌, అక్టోబర్ 16:కాంట్రాక్టర్ల నుంచి కెసిఆర్‌ ఎంత కమీషన్లు తీసుకున్నదీ లెక్క తన దగ్గర ఉందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి అన్నారు. వాటని త్వరలోనే బయటపెడతానని అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని కెసిఆర్‌ నిర్మాణ కంపెనీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కాంట్రాక్ట ర్లకు కెసిఆర్‌ కట్టుబానిసగా మారారని జైపాల్‌ రెడ్డి ఆరోపించారు.

‘‘ప్రాజెక్టుల వాస్తవ వ్యయం కంటే దాదాపు 30 శాతం అంచనాలు పెంచి ఖర్చు చేశారు. అందులో కేసీఆర్‌ 6 శాతం కమీషన్‌ తీసుకోవడంతోపాటు..మంత్రులకు, తన కుటుంబ సభ్యులకు, భజనపరులకు ఎంత శాతం కమీషన్‌ ఇవ్వాలో కూడా ఆయనే నిర్ణయించారు’’ అని ఆరోపించారు. రూ.వేల కోట్లు ఖర్చయినా గ్రామాలకు గొట్టాలు వచ్చాయి తప్ప నీళ్లు రాలేదని, ఎకరా భూమికి సాగునీరు పారలేదన్నారు. ‘‘కేసీఆర్‌ ఏ పని చేసినా ధైర్యంగా చేస్తాడు. ఆయన నిజంగా సచ్చీలుడైతే నేను చెప్పిన లెక్కలు తప్పని నిరూపించాలి’’ అని సవాల్‌ విసిరారు. నాలుగేళ్లలో తెలంగాణను నిండా ముంచిన చరిత్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అధికారంలోకి రాగానే నాలుగేళ్ల తెరాస పాలనలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పనుల్లో తేడా జరిగినట్లు తేలిన పక్షంలో సదరు కంపెనీల అర్హత రద్దు చేస్తామని హెచ్చరించారు.