ఇక వారికి ప్రజలే గట్టిగా బుద్ది చెప్పాలి

SMTV Desk 2018-10-14 13:30:54  naini Narasimhareddy, TRS Party,

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, సిఎం కేసీఆర్‌లపై కాంగ్రెస్‌ రేవంత్‌రెడ్డి ఈరోజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడానికి తనకు సిఎం కేసీఆర్‌ 10 కోట్లు ఇస్తానని మీడియా సమక్షంలో చెప్పారని, ఎన్నికలలో తెరాస డబ్బు వెదజల్లబోతోందని చెప్పడానికి అదే నిదర్శనమని కనుక సిఎం కేసీఆర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘం ప్రధానాధికారు రజత్ కుమార్ ను కోరారు.

దీనిపై నాయిని నర్సింహా రెడ్డి స్పందిస్తూ, “రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేసేవాడు. గత ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల ఖర్చులకు సిఎం కేసీఆర్‌ రూ. 5-10 లక్షలు ఇస్తానని చెప్పారు. నేను పొరపాటున రూ.10 కోట్లు అని అన్నాను. రేవంత్‌రెడ్డి ఆ మాట పట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. నేను గత ఎన్నికల గురించి మాట్లాడితే రేవంత్‌రెడ్డి దానిని ఇప్పటి ఎన్నికలతో ముడిపెట్టి నాపై ఫిర్యాదు చేశాడు. నేటికీ రేవంత్‌రెడ్డికి-చంద్రబాబు నాయుడుతో బలమైన సంబంధాలు ఉన్నాయని ఆయన మాటలతో అర్ధమవుతోంది. ఇలాంటి వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏవిదంగా ఇచ్చిందో తెలియదు కానీ అతని వలననే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయం.

మా ప్రభుత్వం గత నాలుగేళ్లలో 400కు పైగా పధకాలు అమలుచేస్తుంటే, ఈ కాంగ్రెస్ నేతలకు అవేమీ కనబడకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. పైగా రైతులకు, సమాజంలో వివిదవర్గాల ప్రజలకు మేము ఏదైనా మేలు చేయాలని చూస్తే, కాంగ్రెస్‌ నేతలు వెంటనే కోర్టులలో ప్పిటిషన్లు వేసి వాటిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటారు. రైతుబందు పధకం మీద కోర్టుకు వెళ్ళిన కాంగ్రెస్‌ నేతలకు న్యాయస్థానం రెండు చెంపలు వాయించి పంపింది. అయినా వారికి సిగ్గులేదు.ఇంకా ఎన్నికలను ఆపాలని పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఇక వారికి ప్రజలే గట్టిగా బుద్ది చెప్పాలి,” అని అన్నారు.