అది నా అదృష్టమే

SMTV Desk 2018-10-12 17:33:17  RASMIKA MANDANNA

తెలుగులో చేసిన మొదటి చిత్రం ‘ఛలో’తో మంచి విజయాన్ని అందుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో టాలీవుడ్‌లో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అనంతరం నాగార్జున, నానీల మల్టీస్టారర్ ‘దేవ్‌దాస్’లో మెరిసిన రష్మికకు ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోలు ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే టాలీవుడ్‌లో తనకు ఇంత క్రేజ్ ఎలా వచ్చిందో… ఇంతగా ప్రేక్షకులు తనను ఎందుకు అభిమానిస్తున్నారో అర్థం కావడం లేదని అంటోంది రష్మిక మందన్న. “నేను మంచి నటిని కాదు. నటనలో నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నటనలో ఇంకా ఓనమాల వద్దే ఉన్నాను. ప్రతి సినిమాకు నా నటనను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా అందం గురించి కూడా పలువురు పొగుడుతున్నారు. నాకంటే అందగత్తెలు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అయినా కూడా నాకే ఇంత క్రేజ్ రావడం అదృష్టంగానే భావిస్తున్నాను”అని పేర్కొంది రష్మిక. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో కలిసి ‘డియర్ కామ్రెడ్’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగు, కన్నడంలో కొన్ని సినిమాలకు సైన్ చేసింది.