మధ్యాహ్నం బిజెపిలో...రాత్రికి కాంగ్రెస్ పార్టీలోకి ..!

SMTV Desk 2018-10-12 12:21:34  Padmini Reddy, BJP,Congress,Telangana Politics

సీనియర్ కాంగ్రెస్ నేత, పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి గురువారం మధ్యాహ్నం బిజెపిలో చేరారు. రాత్రి 9 గంటలకు బిజెపికి గుడ్ బై చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొన్నారు. ఆమె చెప్పా పెట్టకుండా బిజెపిలో చేరడంతో సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా కలకలం రేగింది. పార్టీ కార్యకర్తలు దామోదర రాజనర్సింహ నివాసానికి చేరుకొని పద్మినీ రెడ్డిని తక్షణమే వెనక్కు రప్పించాలని నినాదాలు చేయడం మొదలుపెట్టారు.


హైదారాబాద్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఉన్న దామోదర రాజనర్సింహ తన భార్య బిజెపిలో చేరిందనే సంగతి తెలియగానే మొదట షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని ఆమెతో ఫోన్లో మాట్లాడి వెనక్కు తిరిగి రావలసిందిగా కోరారు. భర్త, కాంగ్రెస్ కార్యకర్తల వొత్తిడి కారణంగా ఆమె కాంగ్రెస్ గూటికి చేరుకొన్నారు. అనుకోకుండా తాను బిజెపిలో చేరానని, కానీ కాంగ్రెస్ కార్యకర్తల వొత్తిడి కారణంగా తన నిర్ణయం మార్చుకొంటున్నానని, ఇకపై కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆమె తెలిపారు. ఆమె ఈ ప్రకటన చేయగానే కాంగ్రెస్ కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తూ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే ఆమె భర్తకు చెప్పకుండా బిజెపిలో చేరారా? దామోదర రాజనర్సింహకు ఆమె పార్టీ మారుతున్న విషయం నిజంగా తెలియదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఈసారి సంగారెడ్డి నుంచి శాసనసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగ్గారెడ్డికే టికెట్ కేటాయించబోతున్నట్లు సంకేతాలు వెలువడటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.

ఆమె పార్టీలోకి తిరిగివస్తే సముచిత స్థానం కల్పిస్తామని దామోదర రాజనర్సింహ చెప్పడం గమనిస్తే తన భార్యకు సంగారెడ్డి నుంచి టికెట్ ఇప్పించుకోవడానికి ఆయనే ఈ ఉపాయం పన్ని ఉండవచ్చుననే మరో వాదన కూడా వినిపిస్తోంది. అది నిజమో కాదో కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా వెలువడితే కానీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ కేవలం 8 గంటల వ్యవదిలో రెండు పార్టీలు మారి పద్మినీ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పవచ్చు.