కుట్రపూరితంగా ఐటీ దాడులు....

SMTV Desk 2018-10-12 12:02:07  delhi,CM Ramesh, Central government, IT rides

ఢిల్లీ,అక్టోబర్ 12: ఐటీ దాడులను సీఎం రమేశ్‌ తీవ్రంగా ఖండిస్తూ మీడియాతో సమావేశమయ్యారు . ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది ,రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసినందునే తనపై కుట్రపూరితంగా ఐటీ దాడులు చేయిస్తున్నారని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఆరోపించారు.

ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని వేధించాలని చూస్తోంది. ఆంద్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర పన్నుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడే సమస్య లేదు . కడప ఉక్కు కర్మాగారంపై దీక్ష చేసినందునే నాపై దాడులు చేస్తున్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు డిమాండ్‌తో‌ నేను దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం కేంద్రం మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి కర్మాగారం ఏర్పాటుపై నిలదీశాను. దీనికి ప్రతిఫలంగా మరుసటిరోజే నాపై ఐటీ దాడులు చేయించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే కేంద్రం ఐటీ దాడులతో రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృష్టిస్తోంది.

కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే ఐటీ అధికారులకు సహకరించమని నా అనుచరులకు సూచించా. గాంధేయ పద్ధతిలోనే నిరసన తెలియజేయమని చెప్పా. సీఎం రమేశ్‌పై దాడులు జరుగుతాయని భాజపా, వైకాపా నేతలు కొద్దిరోజుల క్రితమే చెప్పారు. వైకాపా చెప్పినట్లే భాజపా నడుచుకుంటోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పండి ? వారి కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు . మాపై ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేది లేదు. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం’ అని మీడియా తో వెల్లడించారు .