ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-07-19 19:18:44  VENKAIAH NAIDU , BJP PARTY ,PM MODI , ARUN JAITLEY , VICE-PRESIDENT CANDIDATE , AMITHSHA

న్యూఢిల్లీ, జూలై 19 : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌ చేసి తెలిపి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. మంగళవారం ఉదయం వెంకయ్యనాయుడు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వెంకయ్యనాయుడు నామినేషన్ పత్రాలపై టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి ప్రతిపాదకుడిగా సంతకం చేశారు. ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి తన పేరు పరిశీలనలో ఉందన్న వార్తలపై వెంకయ్య తనదైన శైలిలోనే స్పందించారు. రాష్ట్రపతి కాదు.. ఉపరాష్ట్రపతి కాదు.. నేను ఉషాపతిని మాత్రమే (ఆయన సతీమణి పేరు ఉష) అని చమత్కరించి దాటవేశారు. కానీ చివరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు వచ్చారు. ఎన్డీఏ కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతోనే వెంకయ్యనాయుడు విజయం దాదాపు ఖాయమైపోయింది. యూపీఏ కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కనుక సంఖ్యాపరంగా లోక్‌సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉంది. రాజ్యసభలో సైతం ఆ మేరకు మెజారిటీని కూడగట్టుకుంది. ఉభయ సభల్లోని 790 మంది సభ్యుల్లో ముగ్గురు ఇటీవల మరణించడంతో మిగిలిన 787 మందిలో (నామినేటెడ్ సభ్యులతో కలుపుకుని) వెంకయ్యనాయుడికి గరిష్ఠంగా 550 కంటే ఎక్కువ మంది ఓట్లు లభించే అవకాశం ఉంది.