బతుకమ్మ ఉత్సవాలు

SMTV Desk 2018-10-09 11:09:03  Telangana Bathukamma, Bathukamma Utsavaalu

నేటి నుంచి రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి. తొమ్మిది రోజుల పాటుసాగే ఈ ఉత్సవాల తొలి రోజైన ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అవుతాయి. నేటి నుంచి రోజుకొక వంటకంతో బతుకమ్మకు నైవేద్యం సమర్పించుకొంటారు కనుక ఆపేరుతోనే వరుసగా అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు, నానేబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయ, వెన్నముద్దల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకొంటారు.

ఈనెల 17న దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్ధం పట్టే ఈ పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటా రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తోంది. అయితే ఈసారి పండుగ సమయానికే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయినప్పటికీ వివిద ప్రభుత్వ శాఖలు తొమ్మిదిరోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరపడానికి అన్నీ ఏర్పాట్లు చేశాయి.

హైద్రాబాద్ పీపుల్స్ ప్లాజాలో పర్యాటక శాఖ అధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. దీనిలో తెలంగాణ వంటకాలతో పాటు వివిద రాష్ట్రాల పిండి వంటలు, మిఠాయిలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాకు రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోనే కాక విదేశాలలో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందున మొత్తం రూ.20 కోట్లు నిధులు విడుదల చేసింది.

సద్దుల బతుకమ్మ ఉత్సవాల ముగింపు రోజున సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో హైదరాద్ నగరంలో ట్యాంక్ బండ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ తరపున శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది.