మొదటి టెస్టు మ్యాచ్‌లోనే రికార్డు బద్దలు...

SMTV Desk 2018-10-06 17:37:37  sports, Prthvisa,cricket,record

రాజ్‌కోట్‌ భారత్, వెస్టిండీస్ తొలిటెస్టులో ఓపెనర్ పృథ్వీషా మెరుపులు మెరిపించాడు. టెస్టు మ్యాచ్‌కు వచ్చిన అభిమానులకు వన్డే మ్యాచ్‌ను తలపించేలా అదరగొట్టాడు. బౌలర్ వేసే ప్రతీ బంతిని బౌండరీకి చేర్చి ముచ్చెమటలు పట్టించాడు. 18 ఏళ్ల పృథ్వీషా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అబ్బురపరిచాడు. రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీషా మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్లోనే రాహుల్ వెనుదిరిగినా.. పుజారాతో కలిసి వికెట్ పడకుండా ఆడుతూ.. కేవలం 56 బంతుల్లో అర్థ శతకం, 98 బంతుల్లో సెంచరీ చేసి కెరీర్లో మొదటి టెస్టు మ్యాచ్‌లోనే రికార్డు నమోదు చేశాడు. మొదటి టెస్టులోనే హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన చిన్న వయసు భారత బ్యాట్స్‌మెన్‌గా షా నిలిచాడు. అంతే కాదు భారత క్రికెట్లో సెంచరీ చేసిన రెండో అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే పృథ్వీకంటే ముందు సచిన్ టెండూల్కర్ ఈ రికార్డు సాధించాడు. పృథ్వీషా 18 ఏళ్ల 329 రోజులకే సెంచరీ చేయగా.. సచిన్ 17ఏళ్ల 107 రోజులకే సెంచరీ చేసి యంగెస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు మొదటి టెస్టులో సెంచరీ చేసిన వారిలో పృథ్వీషా ప్రపంచంలో 104వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచి, 15వ భారత క్రికెటరై 59 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 134 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పృథ్వీషా కాట్ అండ్ బౌల్‌గా వెనుదిరిగాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే శతకంతో అందరినీ ఆశ్చర్యపరిచిన పృథ్వీ… బిషూ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ 57 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కోహ్లీ 20, రహనే 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.