ఎన్నికలపై హైకోర్టులో విచారణ?

SMTV Desk 2018-10-06 16:52:57  Hyderabad,high court ,kcr

హైదరాబాద్ ,అక్టోబర్ 06: తెలంగాణా శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడాన్ని వివిద కారణాలతో సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లపై శుక్రవారం ఉమ్మడి హైకోర్టులోనే విచారణ జరపాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో తేడాలున్నా లేదా నకిలీ ఓట్లు ఉన్నట్లు తేలినా శాసనసభ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయవచ్చునని స్పష్టం చేసింది. ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను రేపు ఒకేసారి విచారించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. సినియర్ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషనుపై ఆయన తరపున సీనియర్ కాంగ్రెస్‌ నేత మరియు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టులో వాదించారు. తెలంగాణా రాష్ట్రానికే చెందిన శశాంక్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఓటర్ల జాబితా గడువును కుదించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వాటితో పాటు దాఖలైన మరో రెండు పిటిషన్లను కలిపి హైకోర్టుకు బదిలీ చేసి వాటిపై శుక్రవారం విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ముందస్తు ఎన్నికలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటివరకు దాఖలైన అన్ని పిటిషన్లను వరుసగా కొట్టివేస్తున్న హైకోర్టు, రేపు విచారించబోయే పిటిషన్లపై భిన్నంగా స్పందిస్తుందా లేక వాటిని కూడా కొట్టివేస్తుందా చూడాలి.