జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక ఉగ్రవాది అయితే పవన్ కళ్యాణ్ సామాజిక ఉగ్రవాది

SMTV Desk 2018-10-01 14:27:32  Jaganmohan reddy, Pawan Kalyan, TDp

ముందస్తు ఎన్నికల నేపద్యంలో తెలంగాణాలో ఒకరకమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉండగా, ఏపీలో మరో రకమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ అధికార టిడిపికి జగన్, పవన్ కళ్యాణ్, బిజెపి నేతలు నిత్యం సవాళ్ళు విసురుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “కొన్ని రాజకీయ శక్తులు నన్ను హత్య చేసి అడ్డుతొలగించుకోవాలని చూస్తున్నాయని, దీనిలో ప్రధానంగా ముగ్గురు రాజకీయ నాయకులున్నారని చెప్పడం సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ మాటలపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రంగా స్పందిస్తూ, “జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్ధిక ఉగ్రవాది అయితే పవన్ కళ్యాణ్ ఒక సామాజిక ఉగ్రవాది. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలో రాణించడం ఒక్క ఎన్.టి.రామారావుకే సాధ్యం అయ్యింది. సినీ గ్లామరుతో ముఖ్యమంత్రి అయిపోదామని కలలుకంటున్నారు. ఆయన సోదరుడు చిరంజీవే అటువంటి ప్రయత్నం చేసి భంగపడ్డారు ఇక పవన్ కళ్యాణ్ ఎంత? తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నవారెవరో తెలుసునని చెపుతున్నపుడు ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వారిపై ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ఫిర్యాదు చేయకుండా టిడిపి నేతలపై బురదజల్లడానికి అర్ధం ఏమిటి? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి మాట్లాడి అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు,” అని అన్నారు.