సుప్రీంకోర్టు సంచలన తీర్పు

SMTV Desk 2018-09-28 10:57:56  Supreme court, Sensational verdict,

పటిష్టమైన వివాహవ్యవస్థలు అమలులో ఉన్న దేశంగా భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ నేడు విడాకులు, హత్యలు, ఆత్మహత్యలు సర్వసాధారణమైపోయాయి. వాటికి ప్రధానకారణాలలో వివాహేతర సంబంధాలు ఒకటి. అయితే పరస్పర అంగీకారంతో స్త్రీపురుషులు వివాహేతర సంబంధాలు నెరపడం తప్పు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ దీపక్‌ మిశ్రాతో పాటు ముగ్గురు న్యాయమూర్తులు వివాహేతర సంబంధాలు నేరంకావని స్పష్టం చేశారు. వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తున్న ఐపిసి సెక్షన్స్: 497, 198లు రాజ్యాంగవిరుద్దమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. రాజ్యాంగం ప్రకారం స్త్రీపురుషులను సమాన హక్కులు కలిగి ఉన్నప్పుడు, ఒక వివాహిత స్త్రీ పరాయి పురుషుడితో ఇష్టపూర్వకంగా శారీరిక సంబంధం పెట్టుకొన్నట్లయితే, దానిని నేరంగా పరిగణిస్తే, స్త్రీల సమానహక్కుకు భంగం కలుగుతుందని, స్త్రీల ప్రాధమిక హక్కును తిరస్కరిస్తున్నట్లు అవుతుందని కనుక వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తున్న ఐపిసి సెక్షన్స్: 497, 198లు రాజ్యాంగవిరుద్దమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఎప్పుడో 158 సం.ల క్రితం ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి రూపొందించబడిన ఈ రెండు సెక్షన్స్ వలన వివాహిత స్త్రీ శరీరంపై భర్తకు సర్వాధికారాలు ఉన్నట్లు, అతను ఆమెకు యజమాని అన్నట్లుగా సూచిస్తోందని ఇది రాజ్యాంగ విరుద్దమని కనుక వాటిని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.