రూ.15 లక్షల ప్రమాద బీమా

SMTV Desk 2018-09-22 12:03:55  Accident , Raod accidnet, Insurance

సొంతంగా వాహనం నడుపుకొనే యజమానికి వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని రూ.15లక్షలకు పెంచుతూ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) ఉత్తర్వులు జారీ చేసింది.ఏడాదికి రూ.750 చెల్లించి రూ.15 లక్షల వరకు యజమాని-డ్రైవర్లకు కనీస బీమా కవరేజ్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం క్యాపిటల్ సమ్ ఇన్సూర్డ్(సీఎస్‌ఐ) సెక్షన్ కింద ద్విచక్ర, ప్రైవేట్ కారు/కమర్షియల్ వాహనాలపై లక్ష, రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే బీమా కవరేజ్ లభిస్తున్నది. ప్రస్తుతం పలు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్యాకేజి కింద అధిక సీఎస్‌ఐని ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాలసీదారుడిపై పడుతున్న భారాన్ని దృష్టిలో పెట్టుకొని నియంత్రణ మండలి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఉన్న అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్బంధ వ్యక్తిగత ప్రమాదం(సీపీఏ) కింద యజమాని-డ్రైవర్‌కు కనీసంగా రూ.15 లక్షల బీమా కవరేజ్ కల్పించాలని సూచించింది. ఇందుకుగాను ప్రతియేటా రూ.750 చొప్పున ప్రీమియం తీసుకోవాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడడం, మరణించడం సంభవించినప్పుడు పాలసీదారు నామినీలకు ఈ పరిహారం అందనుంది