రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీళ్లిస్తాం : చంద్రబాబు

SMTV Desk 2018-09-14 16:57:18  Chandrababu naidu, Srishailam Project, Jalasiriki Harati Program, sunnipenta, Polavaram project, Karnool, Andrapradesh, Telugudesham party

కర్నూల్ : కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం జలాశయం వద్ద జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొని, సున్నిపెంట వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ నదుల అనుసంధానంతో నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చేసేంత వరకూ జలదీక్షను విడిచిపెట్టేది లేదని అన్నారు. పోలవరం పనులను ప్రతి సోమవారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 57 ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. సీఎం రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్న అన్ని ప్రాంతాలకు నీళ్లిచ్చే తీరుతామన్నారు. వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చుకొని రాష్ట్రంలోని 57 ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తామన్నారు. మా చొరవవల్లే అన్ని రిజర్వాయర్లలో నీళ్లు ఉంటున్నాయన్న అయన కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా ఎన్నో కష్టాలకు ఓర్చి కళలను సాకారం చేస్తున్నామన్నారు. 2500 టీఎంసీల నీళ్లు సముద్రంలో వెళ్లాయన్న అయన ఆ నీళ్ళే ఉంటే శ్రీశైలం నిండుతుందని… సముద్రంలోకి వెళ్లే ఈ నీటిని ఒడిసిపట్టి అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇస్తామన్నారు.