క్రికెటర్ మహ్మద్ షామీ ఇంటిపై దాడి...!

SMTV Desk 2017-07-18 16:33:19  Cricketer, Mohammed, Shami, attacked

కోల్ కత్తా, జూలై 18 : టీంమిండియా బౌలర్ మహమ్మద్ షామీ పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. దక్షిణ కోల్ కత్తా లోని కట్టు నగర్ లో షామీ నివాసం వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం షామీ తన భార్య తో కలిసి ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో షామీ కారు డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడుపుతూ ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో వాహనదారునికి కారు డ్రైవర్ కు మధ్య గొడవ నెలకొంది. కొద్ది సమయం తరువాత కారులో నుంచి బయటకు దిగి షామీ ఇద్దరికీ సర్ది చెప్పి ఇంటికి చేరుకున్నారు. ద్విచక్ర వాహనదారుడు తన స్నేహితులను వెంటబెట్టుకొని షామీ ఇంటిలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్న ఇంటి సెక్యూరిటీ గార్డు పై దాడి చేసి, అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. షామీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్లని అరెస్టు చేస్తామని వెల్లడించారు. త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్ళే భారత్ జట్టులో మహమ్మద్ షామీ కి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కోహ్లి సేన 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 26 న జరుగనుంది.