వివరాలు వెబ్‌సైట్‌లో : జీహెచ్‌ఎంసీ

SMTV Desk 2017-07-18 14:22:37  HYDERABAD, RAIN, GHMC, TRAFFIC PROBLEMS, HUSSAIN SAAGAR,

హైదరాబాద్, జూలై 18 : కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న మధ్యాహ్నం నుండి కురుస్తున్న వర్షానికి హుస్సేన్‌ సాగర్‌లో నీటి మట్టం అర అడుగు మేర పెరిగి 513.1 అడుగులకు చేరుకుంది. రానున్న మరో రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో జరిగే సమాచారం అంతా ఒక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. చెట్లు విరగడం, రోడ్లపై గుంతలు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీళ్లు నిలవడం, ఇతరత్రా సమస్యలను నివారించేందుకు జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలను ఏర్పాటు చేసింది. 140 వర్షాకాల అత్యవసర బృందాలు, 30 మొబైల్‌ బృందాలు, 91 మినీ మొబైల్‌ బృందాలు, 19 కేంద్ర అత్యవసర బృందాలను ఏర్పాటు చేశామని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. అన్ని బృందాలకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు, అధికారుల వివరాలు ప్రాంతాలవారీగా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. విద్యుత్ సమస్యలకు 1912, జీహెచ్‌ఎంసీ కి సంబంధించి.. 040-21111111, ఇతర సేవలకు.. 100 నెంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ రూంలో పరిశీలిస్తున్నామని, నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.