ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ బొనాంజా

SMTV Desk 2018-09-12 11:14:57  AAsha Angan wadi, PM Modi, Salaries,

దేశవ్యాప్తంగా ఆశా, అంగన్వాడీల్లో సేవలందిస్తున్న కార్యకర్తలకు శుభవార్త! వీరి నెలవారీ గౌరవ వేతనాలను పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అక్టోబరు నెల నుంచి వారి గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు ఆశా వర్కర్లకు ఉచితంగా ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా, అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాలను పెంచుతున్నట్లు చెప్పారు. పోషన్‌ మిషన్‌లో.. పౌష్టికాహరలోపం లేకుండా చిన్నారులు, గర్బిణీలను కాపాడడంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల పాత్రను అభినందించారు. ఆశా వర్కర్లకు ప్రోత్సహాకాలను రెండింతలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆశా వర్కర్లు, హెల్పర్లకు ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని ఈనెల 23న ఝార్ఖండ్‌ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.