అశ్లీల వెబ్ సైట్ల కట్టడికి పొరుగు దేశ సాయం

SMTV Desk 2017-07-17 19:12:58  Curb Child Porn sites, Supreme Court, NCMEC,

న్యూఢిల్లీ, జూలై 17 : దేశంలో పాఠశాల విద్యార్ధుల పై చాలా ప్రభావం చూపుతున్న అశ్లీల వెబ్ సైట్లను అరికట్టడానికి అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మిస్సింగ్‌ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్ సీఎంఈసీ) పిల్లల అశ్లీలానికి సంబంధించిన వీడియోలను 99 దేశాలకు అప్ లోడింగ్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నట్లు కోర్టు విచారణ ద్వారా తేలింది. దేశంలో తప్పిపోయిన కొందరి పిల్లలను, అలానే లైంగికంగా వేధింపులకు గురవుతున్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రత్యేక ఛానెల్ ద్వారా ఆ సంస్థ వివిధ దేశాల భద్రతా సంస్థలకు సమకూరుస్తోందని వెల్లడైంది. చిన్నారుల అశ్లీల వీడియోల కట్టడికి సంబంధించి స్టేటస్ రిపోర్టును కేంద్రం సుప్రీం కోర్టులో సమర్పిస్తూ ఈ విషయాలను పేర్కొంది. ఈ సమాచారాన్ని ఉచితంగా పొందేందుకు వీలుగా ఆ సంస్థ భారత్ లో ఛానెల్ ను ఏర్పాటు చేస్తుందని కేంద్రం తెలిపింది.