కెసిఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

SMTV Desk 2018-09-02 13:26:34  KCR, revanth reddy,

కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌, మంత్రులు, అధికారులు అందరూ ప్రగతి నివేదన సభ ఏర్పాట్ల కొరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా న్యాయస్థానాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రగతి నివేదన సభ కోసం సిఎం కెసిఆర్‌తో సహా మంత్రులు, అధికారులు అందరూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సభకు ఏర్పాట్లు చేయడానికి వేలాది ట్రాక్టర్లను వాడుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్డును నాశనం చేస్తున్నారు. పర్యావరణానికి హాని చేయమని న్యాయస్థానానికి హామీ ఇచ్చి సభా వేధిక పరిసర ప్రాంతాలలో ఇష్టం వచ్చినట్లు చెట్లు నరికేస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నారు. ఒకపక్క హరితహారం గురించి గొప్పలు చెప్పుకొంటూ మరోపక్క చెట్లు నరికేస్తున్నారు. వేలాదిమంది పోలీసులు, అధికారులు తమ రోజువారీ విధులను పక్కనపెట్టి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంగర కలాన్ లో ఇంత పర్యావరణ విద్వంసం, అధికార దుర్వినియోగం జరుగుతున్నప్పటికీ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనుక న్యాయస్థానం తక్షణం స్పందించి సుమోటోగా విచరణ చేపట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సిఎం కెసిఆర్‌తో సహా మంత్రులు, అధికారులు అందరినీ జైళ్ళలోకి పంపాలి.” అని డిమాండ్ చేశారు.