మంత్రిపై నెట్‌జ‌న్ల విమ‌ర్శ‌లు

SMTV Desk 2018-08-26 12:03:28  AP, Yanamala ramakrishnudu, Tooth operation, netizens

రాష్ట్రంలో పంటి చికిత్సకు దిక్కులేదా? అసలు రాష్ట్రంలో పంటి వైద్య నిపుణులే లేరా? మరి ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు.. మరో 30 లక్షల మంది వైద్యం ఎక్కడ చేయించుకుంటున్నారు? ఇవన్నీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దంత వైద్యం(రూట్‌కెనాల్‌) కోసం సింగపూర్‌ వెళ్లి రూ.2.88 లక్షల ప్రభుత్వ సొమ్ము వెచ్చించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది ఏప్రిల్ 12వ తేదీన ఆయన.. అజూర్ డెంటల్ హాస్పటల్‌లో రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నారు. దాని కోసం మెడికల్ బిల్లును 2.88 లక్షలు క్లెయిమ్ చేశారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ ఘటన పట్ల నెట్‌జన్లు ఫైరవుతున్నారు. ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండానే ప్రభుత్వం ఎలా అంత మొత్తం సొమ్మును రిలీజ్ చేస్తుందని సోషల్ మీడియాలో నెట్‌జన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం దంత వైద్యం కోసం సింగపూర్ వెళ్ళాలా అని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఇండియాలో, సింగపూర్‌లో ఉన్న రేట్లను పోలుస్తూ నెట్‌జన్లు కథనాలు ప్రచురిస్తున్నారు. భారీ బిల్లును చెల్లించడం పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నారు. వైద్యం కోసం ఏపీ మంత్రి విదేశాలకు వెళ్లడం.. రాష్ట్ర ఖజానాకు పెద్ద దెబ్బ అని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వైద్యం కోసం మంత్రులు ఎక్కడికి వెళ్లినా పర్వాలేదు, కానీ ఖర్చులు మాత్రం స్వంతంగా భరించాలని ఒకరు సూచించారు. మెడికల్ బిల్లును క్లెయిమ్ చేయించుకునేందుకు, ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 1844ను రిలీజ్ చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్టీఆర్‌వైద్య సేవా ట్రస్టు కూడా మెడికల్ బిల్లుకు ఓకే చెప్పడం సందేహాలకు తెరలేసింది. సింగపూర్‌లో జరిగిన మింట్ ఏషియా సదస్సుకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో పాటు వెళ్లిన మంత్రి యనమల అక్కడ ఖరీదైన దంత చికిత్స చేయించుకోవడం వివాదంగా మారింది.