వైస్సార్సీపీలో ఆనం: సెప్టెంబర్ 2న ముహూర్తం

SMTV Desk 2018-08-25 16:17:58  YSRCP, September 2, Anam ram narayana reddy

ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ లోకి వెళ్లడం దాదాపు ఖాయం అయిపోయింది. నెల్లూరు లో ఆనం బలమైన నాయకుడు అని చెప్పవచ్చు. అయితే నెల్లూరు లో టీడీపీ పరిస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నెల్లూరు పరిధిలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటె 7 వైసీపీ కైవసం చేసుకున్నది. మిగిలిన 3 టీడీపీ కైవసం చేసుకున్నది. అయితే ఇప్పడూ ఆనం కూడా వైసీపీ లోకి వెళుతున్నాడంటే టీడీపీ ని నెల్లూరు లో ఆ దేవుడు కూడా కాపాడలేడు. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్దన్ రెడ్డితో ఆనం రాంనారాయణరెడ్డి భేటీ అయ్యారు. వచ్చే సెప్టెంబర్ 2న విశాఖపట్నంలో జగన్ ను కలిసి పార్టీ కండువా కప్పుకోనుండడంతో ఈ భేటీకి మంచి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీ దాదాపు గంట సేపు జరిగినట్లు, ఇందులో జిల్లా రాజకీయాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విశాఖపట్నంలో జరుగుతుండడంతో..ఆనం అక్కడికే వెళ్లి పార్టీలో చేరనున్నారు. అదే రోజు రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజు కావడంతో ఆనం పార్టీ చేరికపై రాజకీయ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీలో చేరుతుండడంతో జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా ఆనం ఇంటికి వెళ్లి రామనారాయణరెడ్డిని కలుస్తున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి శుక్రవారం ఆనం ఇంటికి వెళ్లి కలిశారు. వారిద్దరు కలవడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గతంలో ఆనం కుటుంబంతో కలిసే కాకాణి ఉండేవారు. కానీ రాజకీయాల కారణంగా దూరమయ్యారు. రామనారాయణరెడ్డి ఇంటికి వెళ్లిన గోవర్ధన్‌ రెడ్డి పార్టీలోకి వస్తే కలిసిపనిచేద్దామని చెప్పారు. శనివారం నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ కూడా రామనారాయణరెడ్డిని ఆయన ఇంటిలో కలిశారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. పలువురు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆనంను కలుస్తున్నారు.