అమరావతిలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

SMTV Desk 2018-08-24 10:49:10  Amaravati, CM Chandra Babu Naidu,

తిరుమల వేంకటేశుడు ఇక అమరావతిలోనూ కొలువుదీరనున్నాడు. కృష్ణానదీ తీరాన 25 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక ధామాన్ని నిర్మించబోతున్నారు. వచ్చే రెండేళ్లలోనే ఇది పూర్తికానుంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భారతీయ శిల్పకళకు అద్దం పట్టేలా అత్యద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. టీటీడీ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిర్మాణ ఆకృతులను అందజేసింది. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఆలయ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. రూ.140 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. చోళులు, చాళుక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలిలో రూపొందించిన నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు టీటీడీ గురువారం అందజేసింది. వాటిని పరిశీలించిన అనంతరం ఆలయ నిర్మాణానికి సీఎం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే ఆగస్టు 29న జరిగే పాలకమండలి సమావేశంలో దీన్ని ఆమోదించనున్నారు. పూర్తిగా రాతితో నిర్మించే ఈ ఆలయానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు.